గుడివాడలో నెల రోజుల ధనుర్మాస వైభవం
చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఉత్సవాలు… జనవరి 8న పదివేల మందితో తిరుప్పావై పాశుర పారాయణం… జనవరి 13న గోదా శ్రీనివాసుల కల్యాణం.. సేవలకు 200 మంది వాలంటీర్ల ఎంపిక…

గుడివాడ, అక్టోబర్ 19: గుడివాడలో ధనుర్మాస మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, ఆయన శిష్యబృందం పర్యవేక్షణలో డిసెంబర్ 16 నుంచి 2027 జనవరి 14 వరకు ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ వేడుకల ద్వారా గుడివాడ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పాలని ఆకాంక్షించారు. స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన మండపంలో ఆధ్యాత్మికవేత్తలు, భక్తులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. చిన్న జీయర్ స్వామి నెల రోజుల పాటు గుడివాడలో ఉండి ఉత్సవాల్లో పాల్గొనడం విశేషమన్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. నిత్యం తీర్థగోష్టి.. ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉత్సవాలకు ముందుగా డిసెంబర్ 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డిసెంబర్ 16 నుంచి ప్రతిరోజూ తిరుప్పావై పాశుర పారాయణం, తీర్థగోష్టి, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయని వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. పదివేల మందితో సామూహిక పారాయణం జనవరి 8న ఎన్టీఆర్ స్టేడియంలో చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో పదివేల మంది భక్తులతో తిరుప్పావై పాశురాల పారాయణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాము వెల్లడించారు. జనవరి 13న అదే వేదికపై గోదా శ్రీనివాసుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గుడివాడతోపాటు పరిసర ప్రాంతాల భక్తులు తరలిరావాలని ఆహ్వానించారు. సేవలకు దరఖాస్తుల ఆహ్వానం ఉత్సవాల్లో సేవలందించేందుకు సుమారు 200 మంది వాలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాలంటీర్లుగా, ఆధ్యాత్మిక కమిటీల సభ్యులుగా పనిచేయాలనుకునేవారు తమ వ్యక్తిగత వివరాలతో శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న జీయర్ స్వామి శిష్యబృందం దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తుందని వివరించారు. క్రమశిక్షణ, సమన్వయం, భక్తులకు సేవ ప్రధాన లక్ష్యాలుగా పనిచేయాలన్నారు. దేవస్థాన ధర్మకర్తల కమిటీ మాజీ చైర్మన్ ఇందిరా రామారావు మాట్లాడుతూ.. భక్తుల భాగస్వామ్యంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వికాస తరంగిణి ప్రతినిధి యార్లగడ్డ జితేంద్ర మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలపై యువత అవగాహన పెంచుకోవాలని, ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ లింగం చిట్టిబాబు, ఈవో కందుల గోపాలరావు, యార్లగడ్డ రాజేష్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, నాయకులు లింగం ప్రసాద్, దింట్యాల రాంబాబు, చేకూరు జగన్మోహనరావు, వేదపండితులు వేదాంతం అప్పలాచారి తదితరులు పాల్గొన్నారు.

