చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి
ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థనలు… పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ… గుడివాడ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు…

గుడివాడ, అక్టోబర్ 19: చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. విజయదశమిని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సోమవారం గుడివాడ పట్టణంలోని నీలా మహాల్ రోడ్డులో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం, జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాము సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయాలకు చేరుకున్న ఆయనకు అధికారులు, ధర్మకర్తల కమిటీల ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలు అందించి, శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ధర్మం, న్యాయం, సత్యం అంతిమంగా విజయం సాధిస్తాయనే సందేశాన్ని విజయదశమి అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ మంచిని ఆచరిస్తూ సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని కోరారు. పండుగలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడంతోపాటు కుటుంబ బంధాలను, సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో అడ్డంకులు తొలగి, చేపట్టే మంచి పనులన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గుడివాడ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగాలని ప్రార్థించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు లభించి రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీల చైర్మన్లు లింగం చిట్టిబాబు, బి. హరిబాబు, కార్యనిర్వహణాధికారులు కందుల గోపాలరావు, గంగు శిరీష, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, నాయకులు లింగం ప్రసాద్, దింట్యాల రాంబాబు, చేకూరు జగన్మోహనరావు, చలసాని ఇందిరా రమణారావు, బొంబాయి శ్రీను, వంగపండు ఆదినారాయణ, రామిదేని వేణుబాబు, వేదపండితులు వేదాంతం అప్పలాచారి, పునీత్ శర్మ, ఆలయ కమిటీల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

