వెలిగొండ టన్నెల్ ప్రమాదంపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి
మృతుడు మోంటీలాల్ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశం... టన్నెల్ పనుల్లో కార్మికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం... ప్రాజెక్టు సీఈ, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి...

అమరావతి, ఆగస్టు 17 (V10TV AP): వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్-2లో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్లో పనులు జరుగుతున్న సమయంలో హైడ్రాలిక్ మిషన్ తగిలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడు మోంటీలాల్ మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ప్రాజెక్టు సీఈతో పాటు మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడు మోంటీలాల్ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందించాలని సంబంధిత అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్న సమయంలో ఇటువంటి విషాద ఘటన చోటుచేసుకోవడం ఎంతో విచారకరమని మంత్రి పేర్కొన్నారు. టన్నెల్ పనుల్లో పాల్గొనే కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. పనుల సమయంలో అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, కార్మికుల ప్రాణ రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

