బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా పయనించాలి
ఐక్య పోరాటంతోనే రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం: నన్నేటి పుష్పరాజ్... ఆదివాసీల రాజ్యాంగ, అటవీ, భూ హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్... రాజమండ్రిలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి...

రాజమండ్రి, ఆగస్టు 17 (V10TV AP): బడుగు, బలహీన వర్గాలు ఐక్యంగా ఒకే తాటిపైకి వచ్చి రాజ్యాధికారం దిశగా పయనించాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలోని ఆనం కళాక్షేత్రంలో బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టంతో పాటు 1/70 భూ బదిలీ నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల నిర్ణయాలకు చట్టబద్ధమైన ప్రాధాన్యం కల్పించాలని పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన ఆదివాసీల భూములను గుర్తించి తిరిగి ఆయా కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా మరింత బలపడాల్సిన అవసరం ఉందని పుష్పరాజ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు లభించే పరిస్థితి రావాలని, బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రి వచ్చే వరకు ఐక్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ జె. పూర్ణచంద్రరావు, మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బూడిద శరత్, మాల మహానాడు సీనియర్ నాయకులు కోలాటి ప్రసాదరావు, కుసుమే వెంకటేశ్వరరావు, కుసుమే కుమార్ రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

