దుర్గమ్మ దర్శనానికి ప్రత్యామ్నాయ మార్గం
వర్షాల సూచనతో ఇంద్రకీలాద్రిపై అధికారులు అప్రమత్తం… ఘాట్రోడ్డులో ఇబ్బందులు తలెత్తితే మహామండపం వైపు నుంచి అనుమతి… సరస్వతీదేవి అలంకార దర్శనానికి తరలివస్తున్న భక్తులు…

విజయవాడ, అక్టోబర్ 16: ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి సారించారు. వర్షాల కారణంగా ఘాట్రోడ్డులో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తితే మహామండపం వైపు నుంచి భక్తులను దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల రాకపోకలు, దర్శన ఏర్పాట్లకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఘాట్రోడ్డులో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించేలా సన్నాహాలు చేస్తున్నారు.

