ఖాకీ వెనుక కన్నీళ్లు .....మహిళా హోంగార్డు సంచలన ఆరోపణలు
ఉన్నతాధికారి ఇంట్లో పని చేయాలని ఒత్తిడి చేశారని మహిళా హోంగార్డు రూపకళ ఆరోపణ... నిరాకరించడంతో శిక్ష పేరుతో ఎస్పీ కార్యాలయానికి పంపి గడ్డి పీకించారని వాపు... విధుల నుంచి సస్పెండ్ చేయడంపై న్యాయం చేయాలని అధికారులను కోరిన మహిళా హోంగార్డు..

కృష్ణాజిల్లా ఆగస్టు 6 (వి10టీవీ) : కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుగా పనిచేస్తున్న రూపకళ పోలీసు ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఇంటి పనులు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు తాను నిరాకరించడంతో శిక్ష పేరుతో వారం రోజుల పాటు ఎస్పీ కార్యాలయానికి పంపి గడ్డి పీకించే పనులు చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన గోడు వినిపించుకునేందుకు ఎస్పీని కలిసినా, తనతో దురుసుగా మాట్లాడారని, "ఉద్యోగం స్టేషన్లో కూర్చోవడానికి కాదు.. ఉన్నతాధికారుల ఇళ్లలో పనిచేయడానికి" అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించారని రూపకళ ఆరోపించారు. భర్త మృతితో కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తన పరిస్థితిని అధికారులు పట్టించుకోలేదని వాపోయారు.ఇటీవల తనను విధుల నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్న రూపకళ, తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

