సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ
ఆర్థిక సహాయం కోరిన దంపతులే చోరీకి పాల్పడిన ఘటన... వారంలోనే కేసు ఛేదించి 98 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం... ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన చిలకలపూడి పోలీసులు...

మచిలీపట్నం, కృష్ణాజిల్లా: సహాయం కోసం ఇంటికొచ్చిన దంపతులే తాళాలు పగులగొట్టి రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన ఘటన మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చింది. గాంధీనగర్‌కు చెందిన పలోటి యాకూబ్ జయరాజ్ ఇంటికి గుడ్లవల్లేరుకు చెందిన చుక్క వీరబాబు, శ్రీలత దంపతులు ఆర్థిక సహాయం కోరుతూ వెళ్లారు. ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించిన వారు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదును అపహరించి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. నిందితుల వద్ద నుంచి సుమారు 98 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దంపతులకు సహకరించిన మరో వ్యక్తితో పాటు మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బందరు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నబి తెలిపారు.

