పశ్చిమలో రూ.4.82 కోట్లతో రహదారులకు శ్రీకారం
నాలుగు ప్రాంతాల్లో ఎండ్ టు ఎండ్ బీటీ రోడ్ల నిర్మాణం… 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు ప్రారంభం… మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట: ఎమ్మెల్యే సుజనా చౌదరి…

విజయవాడ, అక్టోబరు 2: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రూ.4.82 కోట్లతో చేపట్టనున్న ఎండ్ టు ఎండ్ బీటీ రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న, కూటమి నాయకులతో కలిసి ఆయన పనులను ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ప్రకాశం పంతులు విగ్రహం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు రహదారికి ఇరువైపులా రూ.1.99 కోట్లతో డస్ట్‌ఫ్రీ బీటీ రోడ్డు నిర్మించనున్నారు. అలాగే 41వ డివిజన్‌లోని వాసవి కల్యాణ మండపం రోడ్డులో రూ.48.87 లక్షలు, 45వ డివిజన్‌లోని మాదాసు రామారావు వీధిలో రూ.71.26 లక్షలు, 49వ డివిజన్‌లో ఎర్రకట్ట నుంచి సొరంగం వరకు రూ.1.62 కోట్లతో ఎండ్ టు ఎండ్ బీటీ రోడ్లను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. విద్య, వైద్య రంగాల బలోపేతంతోపాటు రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం అందుబాటులో ఉంటుందని, సమస్యలను కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ పురుషోత్తం, ఏఈలు రాజేష్, మార్క్, జాస్మిన్, జనార్దన్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
