గ్రామాల రోడ్లకు రూ.10.70 కోట్లతో కొత్త రూపు
సాస్కి నిధులతో గుడివాడ నియోజకవర్గంలో 21 కి.మీ. మేర రహదారుల అభివృద్ధి... నందివాడ మండలంలో వరుసగా రెండో రోజు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన... ఇలపర్రు, లక్ష్మీనరసింహపురం, అనమనపూడిలో రూ.2.20 కోట్ల పనులకు భూమిపూజ...

నందివాడ, ఆగస్టు 27: గుడివాడ నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (సాస్కి) నిధులతో నియోజకవర్గ పరిధిలో మొత్తం రూ.10.70 కోట్ల వ్యయంతో 21 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నందివాడ మండలంలో వరుసగా రెండో రోజు రహదారుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాము శంకుస్థాపనలు చేశారు. బుధవారం రూ.3.26 కోట్ల పనులకు శ్రీకారం చుట్టగా, గురువారం మరో రూ.2.20 కోట్ల విలువైన మూడు రహదారి పనులకు భూమిపూజ నిర్వహించారు.
సాస్కి నిధులతో ఇలపర్రులో రూ.40 లక్షలతో బీటీ రోడ్డు, లక్ష్మీనరసింహపురంలో రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు, అనమనపూడిలో రూ.60 లక్షలతో జీపీకే రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు.
దశాబ్దాలుగా గ్రామాలను వేధిస్తున్న రోడ్ల సమస్యకు పరిష్కారం లభిస్తోందంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో మెరుగైన రహదారులు కీలకమన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రోడ్ల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని చెప్పారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడబోమని, నిర్ణీత ప్రమాణాలతో పనులను పూర్తి చేసి ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే రహదారులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
కార్యక్రమాల్లో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ, జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో మల్లేశ్వరి, పంచాయతీరాజ్ డీఈ బి. రవి, ఏఈ సూరిబాబు తదితర అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

