వర్షం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అత్యవసర సమీక్ష బుడమేరు వరదపై ప్రస్తుతం ఆందోళన లేదన్న ఆర్డీవో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై తక్షణ చర్యలకు ఆదేశం

గుడివాడ, సెప్టెంబర్ 24: తుఫాను ప్రభావంతో గుడివాడ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో దూరవాణి సమీక్ష నిర్వహించారు. ప్రజావేదిక కార్యాలయం నుంచి ఆర్డీవో బాలసుబ్రమణ్యం, పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్‌తోపాటు రెవెన్యూ, విద్యుత్, పురపాలక శాఖల అధికారులతో మాట్లాడారు. వర్షాల పరిస్థితి, ముందస్తు చర్యలు, సహాయక ఏర్పాట్లపై ఆరా తీశారు. బుడమేరు వరద ఉద్ధృతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి వివరాలను నిరంతరం పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆర్డీవో తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, చిన్నపాటి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని రెవెన్యూ అధికారులు వివరించారు. ఆఫీసర్స్ క్లబ్ సమీపంలో కూలిన చెట్టును వెంటనే తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఏర్పడిన విద్యుత్ అంతరాయాలను సత్వరమే పరిష్కరించినట్లు చెప్పారు. విద్యుత్ సమస్యలపై సమాచారం అందిన వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, బస్టాండ్‌లో వర్షపు నీరు నిలవకుండా చూడాలని పురపాలక అధికారులకు సూచించారు. డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టిసారించి రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కువమంది సిబ్బంది కనిపించేలా విధులు కేటాయించాలని స్పష్టం చేశారు. వర్షాలు తగ్గిన తర్వాత కూడా పారిశుద్ధ్య పనులు కొనసాగించి అంటువ్యాధులకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. వర్షాలు పూర్తిగా తగ్గేవరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాము సూచించారు. కూటమి శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు సహాయం అందించాలని కోరారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ ఉచిత సహాయ సంఖ్యలకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

