స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం!
గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల వ్యూహాలపై టీడీపీ విస్తృత సమావేశం… సమన్వయ కమిటీల ద్వారా అభ్యర్థుల ఎంపికకు నిర్ణయం… టీడీపీలో చేరిన రెండు గ్రామాలకు చెందిన 60 మంది యువకులు…

గుడ్లవల్లేరు, అక్టోబర్ 15: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ప్రతి స్థానంలోనూ గెలుపు సాధించేలా గ్రామస్థాయి నుంచి పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. బుధవారం రాత్రి గుడ్లవల్లేరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయంపై నాయకులతో చర్చించారు. బుధవారం రాత్రి గుడ్లవల్లేరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మండల విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయంపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా పెంజేండ్ర గ్రామానికి చెందిన 25 మంది, వడ్లమన్నాడు గ్రామానికి చెందిన 35 మంది యువకులు, గ్రామస్తులు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే రాము వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అభివృద్ధికి నిధుల సాధన గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. గుడ్లవల్లేరు మండలంలో రోడ్ల అభివృద్ధికి తొలుత రూ.6 కోట్లు మంజూరయ్యాయని, ప్రత్యేక కృషితో రూ.10 కోట్ల వరకు నిధులు సాధించామని తెలిపారు. మరో రూ.22 కోట్ల నిధులు రానున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. సమన్వయ కమిటీలతో అభ్యర్థుల ఎంపిక స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి మండలంలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తామని రాము ప్రకటించారు. ప్రజాదరణ, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎన్నికల్లో వందశాతం విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. టీడీపీ అబ్జర్వర్ ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాబోయే పది రోజులు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాము నాయకత్వంలో వందశాతం విజయాన్ని సాధించాలని మండల నాయకులు తీర్మానించారు. సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, సీనియర్ నాయకుడు కోసరాజు బాపయ్య చౌదరి, పెన్నేరు రమేష్, వల్లభనేని రంగబాబు, కొడాలి రామరాజు, వీర్రాజు, ఈడే మోహన్, బీజేపీ నాయకుడు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

