మూడో ఇంజన్ తో నగరాభివృద్ధికి రాకెట్ వేగం!
కూటమి పాలనలో విజయవాడ అభివృద్ధి శరవేగంగా సాగుతోంది... 10, 13, 14, 15వ డివిజన్లలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విస్తృత ప్రచారం... కూటమి అభ్యర్థులకు మహిళల హారతులు.. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు మద్దతివ్వాలని పిలుపు...

విజయవాడ, అక్టోబర్ 27: కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో విజయవాడ నగరాభివృద్ధి వేగంగా జరుగుతోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కూటమి అధికారంలోకి వస్తే మూడో ఇంజన్ తోడై నగరాభివృద్ధి రాకెట్ వేగంతో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10, 13, 14, 15వ డివిజన్లలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు హారతులు ఇచ్చి ఎమ్మెల్యే గద్దె రామమోహన్తోపాటు అభ్యర్థులకు స్వాగతం పలికారు. 10వ డివిజన్ లబ్బీపేట మసీదు ప్రాంతం, 13వ డివిజన్ ఆర్టీసీ కాలనీ, 14వ డివిజన్ గురునానక్ కాలనీ, వాసవీనగర్, 15వ డివిజన్ అంబేడ్కర్ కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ అభ్యర్థులకు మద్దతు కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడను మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, నగరపాలక సంస్థలోనూ కూటమి పాలన ఏర్పడితే మూడో ఇంజన్ జతవుతుందని తెలిపారు. దీంతో నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టవచ్చని చెప్పారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి దెబ్బతిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారి పార్టీ గుర్తులైన సైకిల్, గాజు గ్లాసు, కమలం పువ్వు గుర్తులపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గద్దె రామమోహన్ ప్రజలను కోరారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావులేకుండా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణపై గద్దె రామమోహన్ ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లో అవినీతికి దూరంగా ఉన్న నాయకుడిగా రాధాకృష్ణకు గుర్తింపు ఉందని పేర్కొన్నారు. నగరాభివృద్ధికి ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో కలపాల శ్రీప్రియ, దేవినేని నాగమహిత, షేక్ సహేరాబాను, జాస్తి సాంబశివరావు, గన్నే ప్రసాద్ (అన్నా), బొప్పాయి నాని, దేవినేని అపర్ణ, ఫిరోజ్, కొత్తపల్లి రమేష్, కరిముల్లా, చలసాని రమణ, సిరాజుద్దీన్, కలపాల విక్రమ్, ఇంతియాజ్, కొర్రపాటి సురేంద్రతోపాటు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
