75, 66వ డివిజన్లలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న బొండా ఉమామహేశ్వరరావు... ప్రతి డివిజన్ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామన్న వంగవీటి రాధాకృష్ణ... ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్న కూటమి నాయకులు...

విజయవాడ, అక్టోబర్ 29 : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 75, 66వ డివిజన్లలో ఎన్డీఏ కూటమి నాయకులు గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 75వ డివిజన్ మధ్యకట్ట బుడమేరు వంతెన వద్ద ప్రారంభమైన ప్రచారంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. 75వ డివిజన్ బీజేపీ అభ్యర్థి బొమ్మదేవర రత్నకుమారి, 66వ డివిజన్ జనసేన అభ్యర్థి మట్ల రవీంద్రకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం, విజయవాడ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందించే పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని చెప్పారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌కు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నదే తమ ఉద్దేశమన్నారు. వీధి దీపాలు, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటు పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. మెరుగైన పౌర సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో కూటమి అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

