ప్రతిభకు సాంకేతిక తోడు
గుడివాడలో ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము దంపతులు అధ్యయన సామగ్రి, సాధన పరీక్షలు, పరీక్ష విధానంపై సమగ్ర అవగాహన నైపుణ్యాలతో కూడిన భవిష్యత్ గుడివాడ నిర్మాణమే లక్ష్యమన్న ఎమ్మెల్యే


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 26 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి, జాతీయ ఆదాయ ఆధారిత ప్రతిభా ఉపకార వేతన పరీక్షలో విజయం సాధించేందుకు అవసరమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఎఫిసెన్స్ సిస్టమ్స్ రూపొందించిన ఎన్ఎంఎంఎస్ స్కాలర్ యాప్‌ను శనివారం గుడివాడలో ఆవిష్కరించారు. గుడివాడ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎఫిసెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వెనిగండ్ల సుఖద దంపతులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు యాప్‌ను ప్రారంభించారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు అవసరమైన అధ్యయన సామగ్రి, సాధన పరీక్షలు, పరీక్ష విధానంపై అవగాహనతోపాటు విద్యార్థుల్లో తార్కిక ఆలోచన, సృజనాత్మకత, సమస్యల పరిష్కార సామర్థ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా యాప్‌లో పాఠ్యాంశాలను రూపొందించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రభుత్వం ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ నైపుణ్యాలతో కూడిన భవిష్యత్ గుడివాడ నిర్మాణమే తమ లక్ష్యమన్నారు. చిన్న వయసు నుంచే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువచేసి, వారి ప్రతిభను సరైన దిశలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఎన్ఎంఎంఎస్ విద్యార్థి జీవితంలో ఎదురయ్యే తొలి ముఖ్యమైన పరీక్షల్లో ఒకటని, ఇందులో విజయం సాధిస్తే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే

ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు నిపుణులను పంపించి విద్యార్థులకు శిక్షణ అందిస్తామని చెప్పారు. పదో తరగతి ఫలితాలను మెరుగుపరచడంతోపాటు పోటీ పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక ఆధారిత యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వెనిగండ్ల సుఖద మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడమే యాప్ రూపకల్పన ప్రధాన ఉద్దేశమన్నారు. ఉపకార వేతనానికి అర్హత సాధించడం ఆర్థిక ప్రయోజనంతోపాటు విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యానికి గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయులు యాప్‌పై పూర్తి అవగాహన పెంచుకొని విద్యార్థులకు సమర్థంగా మార్గదర్శనం చేయాలని సూచించారు. నవంబర్‌లో జరిగే ఎన్ఎంఎంఎస్ పరీక్షలో గుడివాడ నియోజకవర్గం నుంచి అత్యధిక మంది విద్యార్థులు అర్హత సాధించేలా కృషి చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు రజని, బాలాజీ, గోపాలరావు, శ్రీనివాస్, డేవిడ్‌రాజు, ఎఫిసెన్స్ ప్రాజెక్టు హెడ్ గోపి, బలరాం, ప్రియా, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

