కార్మికుల ఎదురుచూపులకు నీడగా ‘లేబర్ అడ్డా’
ఎండా వానలో పనుల కోసం రోడ్లపై నిరీక్షణకు స్వస్తి… సంక్షేమ పథకాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి సమాచారం ఒకేచోట… పాయకాపురంలో కార్మిక వసతుల కేంద్రాన్ని పరిశీలించిన బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 6: పనుల కోసం ఎండా వానలో రోడ్లపై నిలబడి ఎదురుచూసే భవన నిర్మాణ కార్మికులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించడమే లేబర్ అడ్డాల లక్ష్యమని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగునాడు కార్మిక సంఘం రాష్ట్ర ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం పాయకాపురం రైతు మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సమీకృత కార్మిక వసతుల కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు బొండా ఉమా చెప్పారు. తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, రాడ్ బెండర్లు, పెయింటర్లు, వడ్రంగులు, సెంట్రింగ్ కార్మికులకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. సౌకర్యవంతమైన క్యాబిన్లలో కార్మికులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేయడంతోపాటు సంక్షేమ బోర్డు ద్వారా లభించే ప్రయోజనాలు, హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని వివరించారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సంవత్సరానికి రూ.12 చెల్లించి సభ్యత్వం పొందడం ద్వారా వివిధ సంక్షేమ ప్రయోజనాలు పొందే

అవకాశం ఉంటుందని తెలిపారు. వివాహం, ప్రసవం, సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం వంటి సందర్భాల్లో అందించే సహాయంపై కార్మికులకు సమాచారం అందిస్తామన్నారు. ఆధునిక పనిముట్ల వినియోగం, కొత్త నిర్మాణ పద్ధతులపై శిక్షణ ఇచ్చి కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నట్లు చెప్పారు. కార్మికులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లను అనుసంధానించేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఏ పనికి ఎంతమంది కార్మికులు అవసరమో సమాచారం అందించి, నైపుణ్యానికి తగిన కూలీ లభించేలా వ్యవస్థను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌నగర్, ప్రకాశ్‌నగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగంపై ఆధారపడే కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని బొండా ఉమా అన్నారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న లేబర్ అడ్డాలు వారికి ప్రత్యక్షంగా ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, డివిజన్ అధ్యక్షుడు జలకం రాజా, ఇన్‌చార్జి పైడి శ్రీను, దాసరి దుర్గారావు, రైతు మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

