మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా డ్రగ్స్, గంజాయి ముఠాలపై పోలీసుల ఉక్కుపాదం…
విజయవాడ, కర్నూలులో 130 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం… విశాఖ జిల్లాలో రూ.1.9 కోట్ల విలువైన 385 కిలోల గంజాయి పట్టివేత… నెల్లూరు జిల్లాలో రెండు ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం…

అమరావతి, అక్టోబర్ 16: మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా ముఠాలపై పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారంతో గడచిన నాలుగైదు రోజుల్లో విజయవాడ, కర్నూలు, విశాఖ, నెల్లూరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈగల్, స్థానిక పోలీసులు, రైల్వే పోలీసు బృందాల సమన్వయంతో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు నిందితులను అరెస్టు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో బెంగళూరు నుంచి రైలులో డ్రగ్స్ తరలిస్తున్నారన్న ఆరోపణలపై ఎంబీఏ విద్యార్థిని యెర్రంశెట్టి నాగసౌమ్యను అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.11 లక్షల విలువైన 110 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెకు హ్యాండ్లర్‌గా వ్యవహరించినట్లు పేర్కొన్న షేక్ బషీర్‌ను కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. కర్నూలు జిల్లా అమకతాడులో మరో ఆపరేషన్‌లో నల్లూరి వరుణ్‌తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ్యుందాయ్ వెర్నా కారులో తరలిస్తున్న రూ.రెండు లక్షల విలువైన 20 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విశాఖ జిల్లా తుర్లువాడ టోల్‌ప్లాజా వద్ద కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్ బృందాలు భారీగా గంజాయిని పట్టుకున్నాయి. ఒడిశాలోని మాచ్‌కండ్ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి టాటా ఐషర్ వాహనంలో తరలిస్తున్న 385 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.1.9 కోట్లుగా అంచనా వేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరులో రెండు ఎకరాల్లో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి పంటను పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ కేసులో ఉప్పలపాటి సుబ్బారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతనిపై ఇప్పటికే 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

