పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా ఆర్థిక భరోసా!
ప్రభుత్వ పెన్షన్లు అందని నిరుపేదలకు చేయూత… వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ సాయం… నియోజకవర్గ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం…

విజయవాడ, అక్టోబర్ 13: ప్రభుత్వ పెన్షన్లు అందని నిరుపేదలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నియోజకవర్గ పరిధిలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రతినెలా నగదు సహాయం అందిస్తూ వారి అవసరాలకు తనవంతు చేయూతనిస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వ పెన్షన్లు అందక నిత్యావసరాలు, మందులు, ఇతర ఖర్చులకు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం కొంత ఊరట కలిగిస్తోందని తెలిపింది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, కుటుంబ పోషణ భారాన్ని మోస్తున్న వితంతువులకు,దివ్యాంగులకు ఈ నెలవారీ సాయం ఆసరాగా నిలుస్తోందని వివరించింది. నియోజకవర్గ అభివృద్ధి పనులతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను గుర్తించి, ఒకసారి సహాయం అందించడంతో సరిపెట్టకుండా ప్రతినెలా తన సొంత నిధుల నుంచి నగదు అందిస్తున్నారని తెలిపింది. ప్రజాప్రతినిధిగా పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ, అవసరమైన సమయంలో ఆదుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.

