గుడివాడలో రూ.4.37 కోట్లతో రోడ్ల అభివృద్ధి
రానున్న రెండు నెలల్లో డ్రైనేజీ, తాగునీటి కోసం రూ.92 కోట్ల నిధులు రానున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడి… నాలుగు వార్డుల్లో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు… రూ.1.18 కోట్లతో నిర్మించిన మున్సిపల్ పార్కు పరిశీలన… ప్రతి కాలనీలో మెరుగైన రోడ్లు, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరే లక్ష్యమని స్పష్టీకరణ…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 9: గుడివాడ పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.4.37 కోట్లతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ముందుగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. 19వ వార్డు సత్యనారాయణపురంలో రూ.2.30 కోట్లతో మూడు రోడ్లు, 25వ వార్డు పేద ఎరుకపాడులో రూ.67 లక్షలతో రహదారి, 28వ వార్డు న్యూ ఇందిరానగర్‌లో రూ.కోటితో ఓల్డ్ మెయిన్ రోడ్డు, 36వ వార్డు పోలీస్ కాలనీలో రూ.40 లక్షలతో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ప్రజలతోనే పనులకు శ్రీకారం చుట్టించగా, మహిళలు భూమిపూజ నిర్వహించారు.అంతకుముందు రూ.1.18 కోట్లతో నిర్మించిన మున్సిపల్ పార్కును కమిషనర్ సింహాద్రి

మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పార్కులో సౌకర్యాలు, నిర్వహణపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు రానున్న రెండు నెలల్లో రూ.92 కోట్ల నిధులు రానున్నాయని తెలిపారు. ప్రతి వార్డులో పెండింగ్ రోడ్లను దశలవారీగా పూర్తి చేస్తామన్నారు. ప్రతి కాలనీలో మెరుగైన రహదారులు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పోలీస్ కాలనీలో తొలిసారిగా రహదారి నిర్మాణం చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, మున్సిపల్ అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

