కొండ ప్రాంతాల్లో కూలుతున్న రక్షణ గోడలు
బలహీన ప్రాంతాలను గుర్తించి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలి ధ్వంసమైన ఇళ్లకు పరిహారం గాయపడిన మహిళకు ఆర్థిక సాయం అందించాలి సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 25: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని కొండ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వారి ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వన్‌టౌన్ కొత్తపేటలోని పితాని అప్పలస్వామి వీధిలో రిటైనింగ్ వాల్ కూలి దిగువన ఉన్న మూడు ఇళ్లు దెబ్బతినగా, ఒక మహిళ గాయపడింది. ఘటనాస్థలాన్ని సీపీఐ ప్రతినిధి బృందంతో కలిసి పరిశీలించిన కోటేశ్వరరావు స్థానికులు, బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నగరపాలక సంస్థ అధికారుల అలసత్వం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ప్రతి వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, రిటైనింగ్ గోడలు కూలడం వంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని విమర్శించారు. వర్షపు నీటి పారుదలకు పటిష్టమైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రాణ,

ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తాత్కాలిక సహాయక చర్యలతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలు, బలహీనంగా ఉన్న రిటైనింగ్ గోడలను వెంటనే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనలో గాయపడిన కుంచమ్మ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇళ్లు దెబ్బతిన్న పితా రాములమ్మ, పితా నూకరత్నం, పితా శ్రీనివాసరావు కుటుంబాలకు నిర్మాణం, మరమ్మతుల కోసం పరిహారం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి సీపీఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు సింగరాజు సాంబశివరావు, డివిజన్ కార్యదర్శి ఆకుల యేసు, నాయకులు ససుపల్లి శ్రీనివాసరావు, ఆకుల భాను, కనకారావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

