స్వచ్ఛత వైపు ప్రజల అడుగులు
అక్టోబరు 2న విజయవాడలో స్వచ్ఛథాన్–2026 ఇప్పటికే ఎనిమిది వేల మందికి పైగా నమోదు ప్రతి రన్నర్‌కు పతకంతోపాటు మొక్క బహుమతి

విజయవాడ, సెప్టెంబర్ 27 : స్వచ్ఛత, పచ్చదనం వైపు ప్రజలు అడుగులు వేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు 2న విజయవాడలో హెచ్‌డీఎఫ్‌సీ స్వచ్ఛథాన్–2026ను ఆకర్షణీయంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌కు ప్రారంభ వేడుకగా నిలిచే ఈ కార్యక్రమం స్వచ్ఛతపై ప్రభావవంతమైన సందేశాన్ని అందిస్తుందన్నారు. బందరు రోడ్డులో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛథాన్ ప్రచార పరుగులో అమరావతి రన్నర్స్, విజయవాడ రన్నర్స్‌తో కలిసి పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం, ఆర్టీసీ బస్టాండు, కనకదుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజ్, అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కృష్ణా కరకట్ట వంటి ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ పరుగు మార్గాన్ని రూపొందించినట్లు చెప్పారు. స్వచ్ఛత ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ మారథాన్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పతకంతోపాటు మొక్కను అందించి స్వచ్ఛ ఆంధ్ర–హరితాంధ్రప్రదేశ్ సందేశాన్ని చాటనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని స్వచ్ఛతలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయి రన్నర్లు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ కోసం స్వచ్ఛ ఆంధ్ర అంటూ స్వచ్ఛత, పచ్చదనం, వ్యర్థాల నిర్వహణపై నినాదాలు చేస్తూ రన్నర్లు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏరియా హెడ్ వినీత్ రాంపే, క్రాంతి గద్దే, ఆర్.రమేష్ చంద్ర, శ్రీనివాస్ దండమూడి, రమేష్ రావి, ఎల్.రామకృష్ణ, తడవర్తి దీపక్, బాబీ నాగ్ తదితరులు పాల్గొన్నారు. హాఫ్ మారథాన్, పది కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్ల విభాగాల్లో పాల్గొనేవారు సెప్టెంబర్ 30లోగా ఐఫినిష్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ఎనిమిది వేల మందికి పైగా నమోదు చేసుకున్నట్లు అమరావతి రన్నర్స్ అధ్యక్షుడు రమేష్ రావి తెలిపారు.

