50 ఏళ్ల నిరీక్షణకు తెర.. జైళ్ల శాఖ ఉద్యోగుల కల సాకారం
క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు... G.O.Ms.No.162 జారీతో దశాబ్దాల సమస్యకు పరిష్కారం... APNGGOs, APJAC నాయకత్వానికి జైళ్ల శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు...

విజయవాడ, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఉద్యోగులు దాదాపు 50 ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్యాడర్ పునర్వ్యవస్థీకరణ సమస్యకు పరిష్కారం లభించిందని జైళ్ల శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన APNGGOs రాష్ట్ర సంఘం, APJAC నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడలోని APNGGOs అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు, APJAC చైర్మన్ ఎ. విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణలను జైళ్ల శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్-1975 ప్రకారం స్టేట్ క్యాడర్లో ఉన్న జైలు వార్డర్, హెడ్ వార్డర్, చీఫ్ హెడ్ వార్డర్ తదితర పోస్టులను ప్రస్తుత పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025కు అనుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం G.O.Ms.No.162, తేదీ 24-08-2026 జారీ చేసినట్లు సంఘం నాయకులు తెలిపారు.
దీని ప్రకారం జైలు వార్డర్ క్యాడర్‌ను కాంటీజియస్ డిస్ట్రిక్ట్ ఇన్ జోన్‌గా, హెడ్ వార్డర్, చీఫ్ హెడ్ వార్డర్ క్యాడర్లను జోనల్ క్యాడర్లుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేసిన ఎ. విద్యాసాగర్, డి.వి. రమణలకు జైళ్ల శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జైళ్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నంబుల విశ్వేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు వై. సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బండి హరికృష్ణ, ప్రధాన సలహాదారు సి. ప్రభాకర్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, కార్యవర్గ సభ్యుడు జ్ఞాన సుందరం తదితరులు పాల్గొన్నారు.

