అమరావతికి అభివృద్ధి బూస్ట్.. రూ.1,129 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్!
29 గ్రామాల్లో మౌలిక వసతులకు రూ.533 కోట్లు... సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణానికి రూ.596 కోట్లు... క్వాంటమ్–ఏఐ యూనివర్సిటీకి 8.5 ఎకరాల భూమి కేటాయింపు...

అమరావతి, ఆగస్టు 28: రాజధాని అమరావతి అభివృద్ధిని మరింత వేగవంతం చేసే దిశగా ఏపీ సీఆర్డీఏ అథారిటీ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ ఏపీ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని నిర్మాణం, మౌలిక వసతులకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.533 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ఈ నిధులను వినియోగించనున్నారు.
అలాగే అమరావతిలో సెంట్రల్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణానికి రూ.596 కోట్లు మంజూరు చేశారు. ప్రాజెక్టులకు అవసరమైన భూమి కేటాయింపునకు సంబంధించి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
దేశంలోనే తొలి క్వాంటమ్–ఏఐ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థకు 8.5 ఎకరాల భూమి కేటాయించేందుకు సీఆర్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

