బెజవాడ మేయర్ పీఠంపై ‘వంగవీటి’ గురి..?
వంగవీటి రాధా పేరుపై కూటమిలో జోరుగా చర్చ.. అధికారిక నిర్ణయమే తరువాయి! మేయర్ పీఠంపై రాధా వైపు మొగ్గు చూపుతున్నారంటూ నగరంలో రాజకీయ ప్రచారం బోండా సిద్ధార్థ సహా పలువురు రేసులో.. అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ!

విజయవాడ: విజయవాడ మేయర్ అభ్యర్థిత్వంపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. వంగవీటి రాధాకృష్ణ పేరును మేయర్ అభ్యర్థిగా కూటమి పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, నగర రాజకీయాల్లో రాధా పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
రాధాకు నగరంలో ఉన్న రాజకీయ, సామాజిక పరిచయాలు, వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఆయన పేరును పరిశీలిస్తున్నారనే చర్చ సాగుతోంది. మరోవైపు బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ పేరు కూడా మేయర్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
విజయవాడ టీడీపీకి చెందిన పలువురు నేతల పేర్లు సైతం తెరపైకి వస్తున్న నేపథ్యంలో చివరకు కూటమి అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అధికారిక నిర్ణయం వచ్చే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంది.

