బస్సులో భారీ చోరీ.. రూ.22 లక్షలు, 400 గ్రాముల బంగారం మాయం!
బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ప్రైవేట్ బస్సులో ఘటన... 400 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు ఫిర్యాదు... హ్యాండ్‌బ్యాగ్‌లోని నగదు, నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు...

విజయవాడ, ఆగస్టు 28: పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి విజయవాడకు ప్రైవేట్ బస్సులో వస్తున్న నగరవాసికి చెందిన భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు మాయమైన ఘటన కలకలం రేపింది.
విజయవాడ రాధాకుమారి అనే మహిళకు చెందిన సుమారు రూ.22 లక్షల నగదు, 400 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు అందింది.
బెంగళూరు నుంచి విజయవాడకు వస్తుండగా నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం వద్ద బస్సు నిలిపిన సమయంలో హ్యాండ్‌బ్యాగ్‌లోని నగదు, బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించినట్టు సమాచారం.
దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్సులో ప్రయాణించిన వారు, బస్సు ఆగిన ప్రాంతం తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

