రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ మంతనాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం... 37 ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై కీలక చర్చ... పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రధాన దృష్టి...

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా వివిధ రంగాలకు చెందిన పెట్టుబడి ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు.
ఎస్ఐపీబీ ముందుకు మొత్తం 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షించారు.
ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అవసరమైన భూములు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా కార్యరూపంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టి సారించారు.
సమావేశంలో మంత్రులు కె. అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

