తూర్పులో 8,140 కుటుంబాలకు పట్టాభిషేకం
11 లక్షల చదరపు గజాల క్రమబద్ధీకరణకు చర్యలు స్థలాల విలువ సుమారు రూ.12 వేల కోట్లు అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ, సెప్టెంబర్ 25 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అర్హత కలిగిన పేదలందరికీ త్వరలోనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయనున్నట్లు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. అశోక్‌నగర్‌లోని రఘు గార్డెన్స్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంతోపాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 24 వేల మందికి పైగా పట్టాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైనట్లు గద్దె రామమోహన్ వెల్లడించారు. రూ.24,497 కోట్ల విలువైన దాదాపు 30 లక్షల చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో సుమారు రూ.12 వేల కోట్ల విలువైన 11 లక్షల చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరించి 8,140 మంది లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పించనున్నట్లు వివరించారు. 22ఏ జాబితాలో ఉన్న భూముల క్రమబద్ధీకరణకూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. ఆ హామీ మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ఒకేసారి అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులకు పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని గద్దె రామమోహన్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో గద్దె క్రాంతికుమార్, తెదేపా డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సమూహ బాధ్యులు, విభాగ బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

