వైభవంగా ఆదిదంపతుల నగరోత్సవం
మంగళవాద్యాలు, కోలాట ప్రదర్శనలతో ఆధ్యాత్మిక సందడి… దుర్గా ఘాట్, ఘాట్ రోడ్డు మీదుగా సాగిన ఊరేగింపు… మహారాజగోపురం వద్ద శాస్త్రోక్తంగా ఆస్థాన సేవ…

విజయవాడ, అక్టోబర్ 17: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై శనివారం సాయంత్రం ఆదిదంపతుల నగరోత్సవం కన్నులపండువగా జరిగింది. పుష్పాలతో అలంకరించిన పల్లకీలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులు పురవీధుల్లో విహరించారు. మంగళవాద్యాల నాదాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ సాగిన ఊరేగింపుతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీ మల్లేశ్వరస్వామివారి సన్నిధిలో ఉత్సవమూర్తులకు అర్చకులు విశేష నివేదనలు, పంచహారతులు సమర్పించిన అనంతరం నగరోత్సవాన్ని ప్రారంభించారు. శాక్సోఫోన్ స్వరాలు, కేరళ పంచవాద్యాల దరువులు ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడి కళాకారుల నృత్య విన్యాసాలు, మహిళల కోలాట ప్రదర్శనలు భక్తులను అలరించాయి. శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు రథం సెంటర్, వినాయకుడి గుడి, కెనాల్ రోడ్డు మీదుగా దుర్గా ఘాట్‌కు చేరుకుంది. మార్గమధ్యంలో భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకుని హారతులు సమర్పించారు. అనంతరం ఘాట్ రోడ్డు మార్గంలో ఊరేగింపు తిరిగి కొండపైకి చేరుకుంది. మహారాజగోపురం ముందు ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆలయ స్థానాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా ఆస్థాన సేవ నిర్వహించారు. వేదపండితులు స్వస్తివాచనాలు పలకగా అర్చకులు విశేష హారతులు సమర్పించారు. దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధాన అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

