గుడివాడకు రూ.4.5 కోట్ల అభివృద్ధి వెలుగులు
రెండు చెరువుల పునరుద్ధరణకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమిపూజ బేతవోలు చెరువుకు రూ.2.09 కోట్లు నాగవరప్పాడు చెరువుకు రూ.2 కోట్లు శనివారం నుంచి రూ.40 కోట్లతో రోడ్లు డ్రైన్ల పనులకు శ్రీకారం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 25: గుడివాడ పట్టణానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో సుమారు రూ.4.5 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం సాయంత్రం ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా 27వ వార్డులో ఏపీ సీఆర్డీఏ నిధులు రూ.22 లక్షలతో నిర్మించనున్న మున్సిపల్ పాఠశాల రోడ్డు, హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ.20 లక్షలతో చేపట్టనున్న ఎస్సీ శ్మశానవాటిక సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అమృత్ 2.0 పథకం కింద రూ.2.09 కోట్లతో చేపట్టనున్న బేతవోలు చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. చెరువు అభివృద్ధి నమూనాను పరిశీలించిన ఎమ్మెల్యే పనులను నిర్ణీత డిజైన్, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులు, నడక మార్గాలను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. అనంతరం 36వ వార్డు నాగవరప్పాడులో రూ.2 కోట్ల అమృత్ నిధులతో చేపట్టనున్న చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో రోడ్లు, డ్రైన్లు, చెరువులు, పార్కులు, ఇతర మౌలిక

వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. శనివారం నుంచి పట్టణంలో సుమారు రూ.40 కోట్లతో రోడ్లు, డ్రైన్ల పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అభివృద్ధి చేసిన ప్రజా ఆస్తులను కాపాడుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. నకిలీ జీవోలు, అసత్య హామీలతో ప్రజలను మభ్యపెట్టడం తమ విధానం కాదన్నారు. కొంత ఆలస్యమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం కాకుండా గుడివాడకు శాశ్వత మౌలిక వసతులు కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ 27, 28వ వార్డుల ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. బేతవోలు, నాగవరప్పాడు చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

