వాగులు, వంకల వద్ద నిరంతర పర్యవేక్షణ
హెచ్.ముత్యాలంపాడు వంతెన, వెలగలేరులో కలెక్టర్ లక్ష్మీశ పర్యటన ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశం వంతెనలు, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
జి.కొండూరు, సెప్టెంబర్ 24: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, వంతెనలు, చెరువులు, ఇతర జలవనరుల వద్ద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హెచ్.ముత్యాలంపాడు వంతెన, వెలగలేరు తదితర ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు. వాగులు, వంకల్లో నీటి ప్రవాహంతోపాటు వంతెనల పరిస్థితిని పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్నారు. భారీ వర్షాలకు వాగులు, వంకల్లో

నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు వాగులు, వంకలు దాటకుండా చర్యలు చేపట్టాలన్నారు. వంతెనలు, కల్వర్టులు, రహదారుల వద్ద నీటి ప్రవాహాన్ని నిరంతరం గమనించాలని ఆదేశించారు. రాకపోకలకు అంతరాయం లేదా ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

