ఆటో డ్రైవర్లే రోడ్డు భద్రతకు రాయబారులు కావాలి: సిఐ రమేష్
అంతర్జాతీయ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం... ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ భద్రత, ప్రజాసేవపై అవగాహన.. ఆస్ట్రం యాప్ వినియోగంతో భద్రత మరింత మెరుగుపడుతుందన్న ట్రాఫిక్ అధికారులు..


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 1: అంతర్జాతీయ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ రామవరప్పాడు రింగ్‌లో ట్రాఫిక్ సీఏ రమేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారు రోడ్డు భద్రతకు రాయబారులుగా వ్యవహరించాలని సీఏ రమేష్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు, రహదారులపై పాటించాల్సిన జాగ్రత్తలు, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా హెల్మెట్, సీట్‌బెల్ట్, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆస్ట్రం యాప్‌ను ఆటో డ్రైవర్ల మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయించి, అత్యవసర పరిస్థితుల్లో దాని వినియోగ విధానాన్ని వివరించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రత విషయంలో ఆటో డ్రైవర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆటో డ్రైవర్లు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ట్రాఫిక్ అధికారులు ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను అభినందించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

