కనకదుర్గమ్మకు రూ.75 లక్షల స్వర్ణ కిరీటం సమర్పించిన భక్తుడు!
శ్రీకాకుళానికి చెందిన భక్తుడు కె. దుర్గాశ్రీనివాస్ గురువారం సమర్పణ… 494 గ్రాముల బంగారంతో రూపొందించిన కిరీటం… దాత కుటుంబానికి వేదాశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు…

విజయవాడ, అక్టోబర్ 15: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళానికి చెందిన కె. దుర్గాశ్రీనివాస్ గురువారం అమ్మవారికి రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. సుమారు 494 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ స్వర్ణ కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. భక్తిశ్రద్ధలతో తయారు చేయించిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించడం ఆనందంగా ఉందని దాత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీకే శీనా నాయక్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు స్వర్ణ కిరీటాన్ని స్వీకరించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించి, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

