కరువుపై సమరానికి విపక్షాల సన్నద్ధం
ఈ నెల 26న రైతు సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ప్రజా పోరాటాలకు జగన్ మద్దతు కోరిన సీపీఐ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు మద్దతు

తాడేపల్లి, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కరువు సమస్యపై ఈ నెల 26న రైతు సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి అనుబంధ సంఘాలు మినహా ఇతర రైతు సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవంగా 50 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సాగు పూర్తిస్థాయిలో గాడిలోపడే పరిస్థితి లేదన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై చేపట్టే పోరాటాలకు సహకరించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరామని, ఆయన సానుకూలత వ్యక్తం చేశారని ఈశ్వరయ్య తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే వైఎస్సార్‌సీపీతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారి ఓట్లను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై జరిగే పోరాటాల్లో పాల్గొనాలని జగన్‌ను కోరినట్లు చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై సీపీఐ పోరాటం చేస్తోందని, ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కోరుతున్న సీబీఐ విచారణకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆరోపణలపై ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలని, నిరసనకారులపై భౌతిక దాడులకు దిగడం సరికాదని ఈశ్వరయ్య పేర్కొన్నారు.

