అమరావతి ఐకానిక్ భవనాలకు తుది మెరుగులు
లండన్‌లో మంత్రి నారాయణ బృందం కీలక పర్యటన... అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఫసాడ్ డిజైన్లపై విస్తృత సమీక్ష... అసెంబ్లీపై ‘స్ఫియర్ టవర్’ నిర్మాణం.. పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేలా ప్రణాళిక...

అమరావతి: రాజధాని అమరావతిలో నిర్మించనున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్‌లో కీలక చర్చలు జరిపింది. ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్అండ్టీ ప్రతినిధులతో సమావేశమై అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల ఫసాడ్ డిజైన్లను సమీక్షించింది.
ప్రధానంగా అసెంబ్లీ భవనం పైభాగంలో ప్రతిపాదించిన ‘స్ఫియర్ టవర్’ డిజైన్‌పై ప్రత్యేకంగా చర్చించారు. టవర్ నిర్మాణ విధానం, వినియోగించనున్న సాంకేతిక పరిజ్ఞానంపై ఎల్అండ్టీ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అత్యాధునిక సాంకేతికతతో స్ఫియర్ టవర్‌ను నిర్మించడంతో పాటు అమరావతికి ప్రత్యేక గుర్తింపునిచ్చే పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దే అంశంపైనా మంత్రి నారాయణ బృందం చర్చించింది. ఐకానిక్ భవనాల రూపకల్పనలో ఆధునికత, ప్రత్యేకత ప్రతిబింబించేలా తుది డిజైన్లపై కసరత్తు కొనసాగుతోంది.

