గుడివాడ అభివృద్ధికి రూ.79 లక్షలతో రోడ్లు
రెండు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన… పారిశుద్ధ్య నిర్వహణకు ఐదు విద్యుత్ చెత్త సేకరణ వాహనాలు ప్రారంభం… ప్రతి వార్డులో మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న ఎమ్మెల్యే…

గుడివాడ, అక్టోబర్ 13: గుడివాడ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 21వ వార్డు ఆదర్శనగర్‌లో రూ.34 లక్షలు, 14వ వార్డులో రూ.45 లక్షలతో మొత్తం రూ.79 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానికులతో కలిసి భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం గుడివాడ పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా మంజూరైన ఐదు విద్యుత్ చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రహదారుల అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటి చెత్త సేకరణకు ఐదు నూతన విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. పట్టణంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గుడివాడను సుందరమైన, పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, మున్సిపల్ అధికారులు సతీష్ చంద్ర, శివాజీ, సత్యనారాయణ, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

