నగర లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఆదాం కుమార్
నూతన అధ్యక్షుడిని సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి పార్టీ శ్రేణులకు న్యాయపరంగా అండగా నిలవాలని సూచన అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ధీటుగా ఎదుర్కోవాలని పిలుపు

విజయవాడ, సెప్టెంబర్ 27 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర లీగల్ సెల్ అధ్యక్షుడిగా న్యాయవాది చిరిగుడి ఆదాం కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదాం కుమార్‌ను వెలంపల్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ లీగల్ విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ వైఎస్సార్‌సీపీ బలోపేతానికి తోడ్పడాలని సూచించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షసాధింపులో భాగంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు లీగల్ సెల్ అండగా నిలవాలని కోరారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతోపాటు అక్రమ కేసులను న్యాయస్థానాల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు న్యాయ విభాగం ముందుండాలని సూచించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అవసరమైన న్యాయ సహాయాన్ని సకాలంలో అందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

