బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం
34 శాతం రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తాం… సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం… ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ…

విజయవాడ, అక్టోబర్ 2: బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని, వారికి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిర్ణయంపై న్యాయపరమైన వివాదం తలెత్తిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఇది కేవలం రిజర్వేషన్ల అంశం కాదని, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, భవిష్యత్తుతో ముడిపడిన విషయమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలైతే గ్రామస్థాయి నుంచి బీసీ నాయకత్వానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని గద్దె అనురాధ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో సుమారు 16,800 మంది బీసీలు రాజకీయ పదవులు పొందే అవకాశాన్ని కోల్పోయారని ఆమె ఆరోపించారు. ఆ నష్టాన్ని సరిదిద్దేందుకే కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టిందన్నారు. బీసీల రాజకీయ సాధికారత విషయంలో టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉందని, ఎన్టీఆర్ హయాం నుంచే వారికి రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాలు, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడమే తమ పార్టీ విధానమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి కట్టుబడి ఉందని, 34 శాతం రిజర్వేషన్ల కోసం అందుబాటులో ఉన్న ప్రతి న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకుంటుందని గద్దె అనురాధ స్పష్టం చేశారు.

