ఏసీబీ వలలో ఏడీ జయరాజు!
భూపాలపల్లి భూగర్భ గనుల శాఖ కార్యాలయంపై ఏసీబీ దాడులు... ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో సోదాలు... వరంగల్, సూర్యాపేట, తాండూరు, హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు...

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు నివాసాలు, ఆయనకు సంబంధించిన ప్రాంతాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. జయరాజుకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో అధికారులు రికార్డులు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సూర్యాపేట, తాండూరు, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆస్తుల విలువ, వాటికి సంబంధించిన పత్రాలు, ఆదాయ వనరులపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
సోదాలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, గుర్తించిన ఆస్తుల వివరాలపై ఏసీబీ నుంచి అధికారికంగా పూర్తి సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.

