ఆరు కుటుంబాలకు జీవనోపాధి భరోసా
నాలుగు ఆటోలు, ఐస్‌క్రీమ్ బండి, మోటారు రిక్షా పంపిణీ… లబ్ధిదారులను ఎక్కించుకొని స్వయంగా వాహనాలు నడిపిన ఎమ్మెల్యే రాము… స్థిరమైన ఉపాధితో పేద కుటుంబాలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే పీ–4 లక్ష్యమని వెల్లడి…



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడ్లవల్లేరు, అక్టోబర్ 2: పేద కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం అందించడం కాకుండా స్థిరమైన జీవనోపాధి కల్పించి, తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే పీ–4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమంలో ఆరు బంగారు కుటుంబాలకు జీవనోపాధి సాధనాలను పంపిణీ చేశారు. లబ్ధిదారుల భాగస్వామ్యంతోపాటు మెయిల్ సంస్థ అందించిన ఆర్థిక సహకారంతో సమకూర్చిన నాలుగు ఆటో రిక్షాలు, ఒక ఐస్‌క్రీమ్ బండి, ఒక మోటారు రిక్షాను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము అందజేశారు. లబ్ధిదారులను వాహనాల్లో ఎక్కించుకొని ఎమ్మెల్యే స్వయంగా వాటిని నడిపి అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు బంగారు కుటుంబాలతో ముఖాముఖిగా మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు ఉద్యోగి లేదా వ్యాపారవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. అవకాశాలు అందని కుటుంబాలకు ఉన్నత స్థాయిలో ఉన్నవారి సహకారం అందించి, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే పీ–4 కార్యక్రమ ఉద్దేశమని చెప్పారు. పేద కుటుంబాల అవసరాలను ముందుగా గుర్తించి, వారికి ఎలాంటి సహాయం అందిస్తే దీర్ఘకాలికంగా ప్రయోజనం కలుగుతుందో అధ్యయనం చేసిన తర్వాతే కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఒకసారి సహాయం అందించడంతో సరిపెట్టకుండా, జీవనోపాధి సాధనాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బంగారు కుటుంబాల పరిస్థితులు, ఆదాయ వనరులు, అవసరాలను పరిశీలించి బంగారు మిత్రుల


ద్వారా అవసరమైన అవగాహన, మార్గదర్శకత్వం కల్పిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగానే ఆటోలు, మోటారు రిక్షాలు, ఐస్‌క్రీమ్ బండి వంటి ఉపాధి సాధనాలను అందించినట్లు వివరించారు. దేశంలో పనిచేసే యువత, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన ప్రజలే అతిపెద్ద ఆస్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ తగిన ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తే కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని చెప్పారు. పీ–4 కార్యక్రమం అమలుకు ఆర్థిక సహాయం అందిస్తున్న మెగా కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే రాము కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ గ్రామాలు, ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సహాయం పొందిన బంగారు కుటుంబాలు స్వయం సమృద్ధి సాధించి భవిష్యత్తులో మరో పేద కుటుంబానికి చేయూతనిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జీవనోపాధి సాధనాలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మెయిల్ సంస్థ, కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. వాహనాల ద్వారా ఉపాధి పొందుతూ తమ కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటామని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడ్లవల్లేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్లు పొట్లూరి రవి, చాట్రగడ్డ రవికుమార్, శ్రీ కొండాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఈడే మోహన్, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, మెయిల్ సంస్థ ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

