లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం.. పునరావాస కేంద్రాలకు తరలింపు
విద్యాధరపురం లేబర్ కాలనీలో తహసీల్దార్ ఇస్మాయిల్ విస్తృత పర్యటన... కొండచరియలు, రాళ్లు జారిపడే ప్రమాదంపై ప్రజలకు హెచ్చరిక... వీఎంసీ అధికారులతో సమన్వయం.. కొండబడి పునరావాస కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు...

విజయవాడ, అక్టోబర్ 28 : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. విజయవాడ పశ్చిమ తహసీల్దార్ ఇస్మాయిల్ బుధవారం విద్యాధరపురం లేబర్ కాలనీతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వర్షాల కారణంగా ముంపు ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను పరిశీలించి ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తహసీల్దార్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. విద్యాధరపురం చెరువు సెంటర్ సమీపంలోని కొండబడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండి ప్రమాదాన్ని ఎదుర్కోవద్దని, ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఇస్మాయిల్ మాట్లాడుతూ అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు జాగ్రత్తలు పాటించాలని, వర్షాలకు కొండలపై నుంచి రాళ్లు జారిపడే ప్రమాదం ఉన్నందున వెంటనే సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కోరారు. విద్యాధరపురం లేబర్ కాలనీ, చెరువు సెంటర్ పరిసర ప్రాంతాలతో పాటు ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కొండబడి పునరావాస కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అధికారులు సూచించినప్పుడు ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తహసీల్దార్ ఇస్మాయిల్ విజ్ఞప్తి చేశారు.పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీఎంసీ, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో ముందస్తు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

