వర్షంలోనూ ట్రాఫిక్ పోలీసుల నిరంతర అప్రమత్తత
తుఫాను ప్రభావంతో విజయవాడలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ ముమ్మరం... ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసుల ప్రత్యేక చర్యలు... వీఎంసీ సిబ్బందితో సమన్వయంతో సమస్యలకు తక్షణ పరిష్కారం...

విజయవాడ, అక్టోబర్ 28 : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం పర్యవేక్షణలో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వర్షపు నీరు నిలిచే రహదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షపు నీటి నిల్వల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడకుండా పరిస్థితులకు అనుగుణంగా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రతికూల వాతావరణంలోనూ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.

