కొండ ప్రాంతాల్లో పొంచి ఉన్న ప్రమాదం.. పోలీసుల అప్రమత్తం
మల్లికార్జునపేట కొండవాసులకు పోలీసుల హెచ్చరిక... కొండచరియలు, రాళ్లు పడే ప్రమాదం నేపథ్యంలో తరలింపు చర్యలు... గాంధీజీ మున్సిపల్ స్కూల్లో భోజన వసతితో పునరావాస కేంద్రం...

విజయవాడ, అక్టోబర్ 28 : అర్నబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విజయవాడలోని కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. భారీ వర్షాలకు కొండలపై నుంచి రాళ్లు జారిపడి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ గుణరామ్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జునపేట కొండ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేకంగా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలకు కొండలపై నుంచి రాళ్లు జారిపడే అవకాశం ఉందని, ప్రమాదం సంభవించే వరకు వేచి చూడకుండా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మైకుల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కొండ ప్రాంత ప్రజల కోసం గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అక్కడ ఆశ్రయంతో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పించినందున ప్రజలు వెంటనే పునరావాస కేంద్రానికి తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొండ అంచులు, రాళ్లు జారిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణరక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసు, నగరపాలక సంస్థ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. వన్‌టౌన్ సీఐ గుణరామ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను చేపట్టారు.

