బీసీలకు జగన్ చేసిన మేలేంటో చెప్పాలి: బుద్దా వెంకన్న
బీసీలకు న్యాయం చేస్తామన్న మాటను జగన్ నిలబెట్టుకోలేదని విమర్శ… స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపణ… బీసీలకు ౩౪ శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి సిద్ధమని వెల్లడి…

విజయవాడ, అక్టోబరు ౬: ఐదేళ్ల పాలనలో బీసీలకు ఏ విధంగా న్యాయం చేశారో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీసీలను సమాజానికి వెన్నెముకగా భావిస్తున్న కూటమి పార్టీలు వారికి స్థానిక సంస్థల్లో ౩౪ శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని వెంకన్న ఆరోపించారు. కోర్టుల్లో వరుస పిటిషన్లు వేస్తూ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించాలని చూస్తోందన్నారు. నవంబరులోగా ఎన్నికలు జరగకపోతే వందల కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదని వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలోనే జగన్ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నాయకులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళుతున్నది ప్రజల్లో ప్రచారం కోసం కాదని, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఒప్పించడానికేనని వ్యాఖ్యానించారు. బీసీ వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని మేయర్‌గా చేసినప్పటికీ, అధికారాన్ని ఎమ్మెల్యే చేతుల్లో ఉంచారని గత ప్రభుత్వంపై వెంకన్న ఆరోపించారు. బీసీలకు జగన్ చేసిన అన్యాయాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యం ద్వారా పేదలకు ఆస్తి భద్రత కల్పించిందని వెంకన్న అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభిస్తోందని తెలిపారు. పోలీసు యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోందని పేర్కొంటూ, పోలీసులపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులు సంయమనం పాటించాలని సూచించారు.

