దసరా విశేష సేవల టికెట్లు విడుదల
‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా భక్తులకు అందుబాటులోకి… కుంకుమార్చన, చండీ హోమం సహా నాలుగు విశేష సేవలు… తొలి అధికారిక ఆహ్వాన పత్రికను స్వీకరించిన మంత్రి ఆనం…

విజయవాడ, అక్టోబరు 5: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన ప్రత్యక్ష విశేష ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్లను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం విడుదల చేశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ప్రారంభంలో ఆలయ స్థానాచార్యులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రికి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం మంత్రి ఆనం ఆన్‌లైన్ విధానంలో విశేష సేవల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దసరా మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే విశేష సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు వీలుగా టికెట్లను విడుదల చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యం, పారదర్శకత లక్ష్యంగా ‘మన మిత్ర’ వాట్సాప్ పాలన నంబరు 9552300009 ద్వారా నిర్ణీత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీ హోమం, ప్రత్యేక దేవీ ఖడ్గమాలార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయ సేవలను మరింత పారదర్శకంగా, సులభంగా భక్తులకు చేరువ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టికెట్ల విడుదల అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, అర్చక బృందం కలిసి దసరా మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను మంత్రి ఆనంకు అందజేశారు. అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను సమర్పించి ఉత్సవాలకు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకుడు బి. శంకర శాండిల్య, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి, అమరావతి సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

