అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం
గత పదేళ్లలో గన్నవరానికి తీరని అన్యాయం... రెండేళ్లలో విజయవాడ రూరల్‌లో రూ.100 కోట్లతో అభివృద్ధి... పల్లె పండుగలో నియోజకవర్గానికి రూ.12.36 కోట్ల నిధులు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 29: గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిపై గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం… ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. గత పదేళ్ల పాలకులు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అభివృద్ధికి పెద్దపీట వేసిందని చెప్పారు. పల్లె పండుగ–3.0లో భాగంగా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో రూ.3.85 కోట్లతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గానికి రూ.12.36 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ రూరల్ మండలంలో రెండేళ్లలో దాదాపు రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రామవరప్పాడు విద్యుత్ ఉపకేంద్రానికి రూ.4.50 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.8.55 కోట్లు, ఎనికేపాడు అండర్‌పాస్‌కు రూ.31.40 కోట్లు, శ్రీశక్తి కల్యాణమార్గం రహదారికి రూ.3.54 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ప్రసాదంపాడులోనే ఇప్పటివరకు రూ.5.61 కోట్లతో వివిధ పనులు చేపట్టామని తెలిపారు. గన్నవరం

సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఆసుపత్రికి జనరేటర్, ప్రహరీ గోడతోపాటు అవసరమైన వైద్య పరికరాల కోసం దాదాపు రూ.3 కోట్ల నిధులు సమకూర్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 69,532 మందికి రక్త పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. ఆసుపత్రి గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా అభివృద్ధి చెందిందనే అంశంపైనా బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. గన్నవరంలో 500 మందికి, బాపులపాడులో 425 మందికి ఇళ్ల పట్టాలు అందించామని, నిడమానూరులో 316 కుటుంబాలకు సుమారు రూ.120 కోట్ల విలువైన ఆస్తులపై హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులకు తన సొంత నిధులతో రూ.2 కోట్లకుపైగా విలువైన మోటార్లు అందించానన్నారు. యువతకు కృత్రిమ మేధ శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని రాజకీయ విమర్శలు, సవాళ్లకు పరిమితం కాకుండా గత పాలనలో గన్నవరానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రెండేళ్లలో చేపట్టిన పనులపై ఆధారాలతో చర్చిద్దామని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధిపై మాట్లాడాలని యార్లగడ్డ వెంకట్రావు సూచించారు.

