పోలవరానికి నిధుల ప్రవాహం కొనసాగాలి
గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టు పూర్తి లక్ష్యం… అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీఎంల సమావేశం ఏర్పాటు చేయాలి… జలధార పనులకు సత్వరం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఢిల్లీ, అక్టోబర్ 8: పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం నిర్మాణ పురోగతితోపాటు రాష్ట్రంలో రూ.30 వేల కోట్లతో చేపట్టిన జలధార పనుల వివరాలను కేంద్ర మంత్రికి వివరించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో పనులను వేగవంతం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ఆయా రాష్ట్రాల్లో రక్షణ కట్టల నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రజాభిప్రాయ సేకరణను త్వరగా పూర్తి చేయించేలా అక్కడి ప్రభుత్వాలతో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలు నిలిపి ఉంచిన పోలవరం పనుల నిలిపివేత ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించాలని కోరారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని

సూచించారు. మూడు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరస్పర సహకారంతో సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పోలవరం వద్ద 41.15 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పునరావాస పనులను వేగంగా చేపడుతున్నట్లు సీఎం వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంతో సమానంగా నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 45.72 మీటర్ల స్థాయి వరకు నీటిని నిల్వ చేసేందుకు చేపట్టాల్సిన పనులపైనా చర్చించారు. ప్రాజెక్టుకు నిధుల కొరత తలెత్తకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో 62 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. తాజాగా మరో 27 లక్షల కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించే పనులకు ప్రొద్దుటూరులో శంకుస్థాపన చేసినట్లు వివరించారు. పనుల పురోగతికి అనుగుణంగా నిధులను సత్వరం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసేందుకు పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్నామని సీఎం తెలిపారు. పోలవరాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలతోపాటు నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలను కేంద్ర మంత్రికి వివరించారు.

