లయోలా కాలేజ్ వద్ద యువకుల వీరంగం
ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో యువకుల మధ్య వివాదం... మాటామాటా పెరిగి పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం... కాలేజ్ సమీపంలో ఘటనతో విద్యార్థులు, స్థానికుల్లో ఆందోళన.. ఆరా తీస్తున్న పోలీసులు...

V10TV విజయవాడ, ఆగస్టు 14: విజయవాడ అయోలా కాలేజ్ సమీపంలో శుక్రవారం కొంతమంది యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. ఫ్రీ ఫైర్ గేమ్ విషయంలో యువకుల మధ్య తలెత్తిన వివాదం మాటామాటా పెరగడంతో పరస్పరం దాడులకు దారితీసినట్లు సమాచారం.
కాలేజ్ సమీపంలోనే యువకులు గుంపులుగా చేరి ఘర్షణకు దిగడంతో అటుగా వెళ్తున్న విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. యువకుల మధ్య మొదలైన చిన్న వివాదం కొద్దిసేపటికే ఘర్షణగా మారినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఘర్షణకు అసలు కారణం ఏమిటి? ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కాలేజీలు, విద్యాసంస్థల పరిసరాల్లో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసుల నిఘా మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

