రాజకీయాల్లోకి యువశక్తి.. కాంగ్రెస్ ఆహ్వానం
• Gen-Z, విద్యార్థులు, నిరుద్యోగ యువత ముందుకు రావాలని పిలుపు... • ఓటర్లుగానే కాదు.. భవిష్యత్ నాయకులుగా ఎదగాలని సూచన... • గుడివాడ భవిష్యత్తు నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్ష...

గుడివాడ, ఆగస్టు 26: రాజకీయాలు కొందరు వ్యక్తులు, కొన్ని కుటుంబాలకే పరిమితం కాకుండా యువతకు విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. గుడివాడ నియోజకవర్గంలోని యువత, Gen-Z, విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొని రాజకీయాల్లో తమ నాయకత్వాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారని పేర్కొంది. ఈ అవకాశాన్ని గుడివాడ నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న యువత రాజకీయాల్లోకి వస్తే కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉద్యోగాలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్థానిక ఉపాధి, గ్రామాల అభివృద్ధి, అవినీతి రహిత పాలన వంటి అంశాలపై యువత తమ ఆలోచనలతో ముందుకు రావాలని సూచించింది.
ప్రజాసేవ చేయాలనే ఆసక్తి, నిజాయితీ, సామాజిక బాధ్యత కలిగిన యువతకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోందని పేర్కొంది. రాబోయే ఎన్నికలను యువత ఒక అవకాశంగా తీసుకుని కేవలం ఓటర్లుగా కాకుండా ప్రజాస్వామ్యంలో క్రియాశీల భాగస్వాములుగా, భవిష్యత్ నాయకులుగా ఎదగాలని కోరింది.
“యువత ముందుకు రావాలి.. గుడివాడ భవిష్యత్తును యువత నిర్మించాలి” అని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

