ప్రాణం తీసుకోవాలనుకున్న వృద్ధుడికి ప్రాణదాతగా ట్రాఫిక్ ఎస్‌ఐ
ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానదిలో సాహసోపేత రక్షణ గజ ఈతగాళ్లతో కలిసి వృద్ధుడిని ఒడ్డుకు చేర్చిన నారాయణ కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రాథమిక సమాచారం

తాడేపల్లి, సెప్టెంబర్ 27 : కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన 64 ఏళ్ల వృద్ధుడిని తాడేపల్లి ట్రాఫిక్ ఎస్‌ఐ నారాయణ సకాలంలో స్పందించి సాహసోపేతంగా రక్షించారు. మంగళగిరి టిడ్కో హౌసింగ్ బ్లాక్–బికి చెందిన వినుకొండ నాగేశ్వరరావు గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నారు. భార్య అనారోగ్యం, కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రాథమికంగా తెలిసింది. సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి సుమారు 10.30 గంటలకు వారధి 13వ పిల్లర్ సమీపంలో నాగేశ్వరరావు కృష్ణానదిలోకి దూకారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే తాడేపల్లి ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ నారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నదిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పటికీ వెనుకంజ వేయకుండా సీతానగరానికి చెందిన గజ ఈతగాళ్లు పీత మల్లేశ్వరరావు, పీత గోపి సహాయంతో చిన్న పడవలో నదిలోకి వెళ్లారు. నీటిలో ప్రాణాలతో పోరాడుతున్న నాగేశ్వరరావును గుర్తించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆయనకు అవసరమైన ప్రాథమిక సహాయం అందించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి వృద్ధుడి ప్రాణాలను కాపాడిన ఎస్‌ఐ నారాయణతోపాటు గజ ఈతగాళ్లను స్థానికులు, పోలీసు అధికారులు అభినందించారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, తీవ్ర మనస్తాపానికి గురైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

