ఎన్టీఆర్ జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తింపు విద్యార్థుల భద్రత దృష్ట్యా పరిహార సెలవు ప్రకటన

విజయవాడ, సెప్టెంబర్ 24 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు పరిహార సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఈ సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు ఆదేశాలు చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
