కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
సచివాలయంలో చంద్రబాబును కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు ఉత్సవాల నిర్వహణ వేదాశీర్వచనంతో స్వామివారి చిత్రపటం, ప్రసాదాల అందజేత

అమరావతి, సెప్టెంబరు 4: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ ఆహ్వానించింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే మురళీమోహన్, దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. సెప్టెంబరు 14 నుంచి అక్టోబరు 4 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం పలికారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలను అందజేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను ఆలయ కమిటీ ప్రతినిధులు సీఎంకు వివరించారు.

